Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైను ముంచెత్తిన కుంభవృష్టి... 6 గంటల్లో 300 మిమీ వర్షపాతం

rain

వరుణ్

, సోమవారం, 8 జులై 2024 (18:41 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. కేవలం ఆరు గంటల్లో ఏకంగా 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముంబై నగరం స్తంభించిపోయింది. జనజీవన అస్తవ్యస్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా సోమవారం ముంబైలోని అన్ని పాఠశాలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నుంచి ముంబైతోపాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట నుంచి 7 గంటల మధ్య 300 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.
 
ముఖ్యంగా అంథేరి, కుర్లా, పాంత్రూప్, కింగ్స్ సర్కిల్, దాదర్ తదితర ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. గత శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలోని థానే ప్రాంతం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీటి కాల్వలు పొంగిపొర్లడంతో నగరంలోని పలుచోట్ల నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ముంబై కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
 
సబర్బన్ రైల్వే స్టేషన్లలో నీరు నిలిచిపోవడంతో ఎలక్ట్రిక్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక మార్గాల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఐదు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. ముంబై బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు. దీంతో ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది.
 
కాగా, ముంబైలో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో 10వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వాతావరణ సూచనలో పేర్కొంది. మరఠ్వాడా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా నేడు (జూలై 8) కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కాగా, ఈ వర్షాల కారణంగా 51 విమాన సర్వీసులను రద్దు చేశారు. సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను పంపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కొత్త బస్సు సర్వీసులు -ఏసీ బస్సులు కూడా..!