దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మరో నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఇప్పటికే 40 మందికిపైగా మృత్యువాతపడిన విషయం తెల్సిందే.
మధ్యలో రెండు రోజులు తెరిపినిచ్చిన వానలు సోమవారం మళ్లీ మొదలయ్యాయి. దీంతో జనజీవనం మరోమారు స్తంభించింది. కాగా, ముంబై, దక్షిణ కొంకణ్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
రాయ్‌గడ్, థానే, పల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలో నేటి నుంచి శుక్రవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది. కెరటాలు 40-50 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతున్నట్టు పేర్కొంది. శుక్రవారం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వివరించింది.