Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై మునిగిపోయింది... మావల్ల కాదని చేతులెత్తేసిన కార్పోరేషన్

ముంబై మునిగిపోయింది... మావల్ల కాదని చేతులెత్తేసిన కార్పోరేషన్
, మంగళవారం, 2 జులై 2019 (11:52 IST)
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షపు నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం ముంబై మహానగరంలో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ నగరాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకుని రావడం తమ వల్ల కాదని బృహన్ నగర పాలక సంస్థ (బీఎంసీ) అధికారులు చేతులెత్తేశారు. దీంతో ముంబై నగర వాసుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 
 
ముంబైలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రైళ్లు, విమానాలు, బస్సులు, విద్యుత్.. ఇలా అన్ని సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలైన దాదర్‌లోని హింద్‌మాతా చౌక్, కంజూర్‌మార్గ్, సియాన్ తదితర ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి.
 
మరికొన్ని రోజుల పాటు వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం, సేవలను పునరుద్ధరించడం బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులకు తలకు మించిన భారంగా మారింది. 
 
ఈ పరిస్థితులపై బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పరదేశీ మాట్లాడుతూ.. ముంబైలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 85 శాతం వర్షపాతం నమోదైందన్నారు. జూన్ మొత్తంలో కురవాల్సిన వర్షం నాలుగు రోజుల్లోనే కురిసిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా కురవలేదని చెప్పారు. ఈ దశాబ్దంలో ఇలా కురవడం ఇదే తొలిసారని వివరించారు.  
 
జూన్ నెల సగటు వర్షపాతం 550 మిల్లీమీటర్లు కాగా, గత 48 గంటల్లోనే అంతకుమించిన వర్షపాతం నమోదైందని వివరించారు. జనజీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ ప్రయత్నం చేస్తున్నామని, కానీ ఈ స్థాయిలో వర్షం పడుతుంటే తామేమీ చేయలేమని స్పష్టం చేశారు. కాగా, ఈ వర్షాలకు ఇప్పటివరకు 18 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్లో భారత నౌకాదళ సిబ్బంది నిమగ్నమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫర్నీచర్ పేరుతో కుచ్చుటోపీ.. భర్త పారిపోతే.. భార్య చిక్కింది...