సాధారణంగా వివాహానికి భారతీయ హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానంవుంది. హిందూ సమాజం పెళ్లిని ఓ పవిత్ర కార్యంగా భావిస్తుంది. ఈ ఘట్టంలో భాగంగా, వధువు మెడలో వరుడు తాళి కట్టడం ఇప్పటివరకు మనం చూశాం. అలాగే, కాళ్లకు మెట్టెలు తొడగడం, నుదుటన బొట్టు పెట్టడం, ఏడు అడుగులు వేయడం వంటి కీలక ఘట్టాలు ఉంటాయి. వీటిలో తాళి బొట్టు(మంగళసూత్రం) అతి ముఖ్యమైంది.
ఒక్క హిందూ సంప్రదాయంలోనే కాదు, ఇతర వాటిలో కూడా తాళికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఇక తాళి అనేది వధువు మెడలో వరుడు మాత్రమే కడతాడు. కానీ, ముంబైకి చెందిన ఓ యువకుడు తాళి విషయంలో సంచలన నిర్ణయం తీసుకుని తాజాగా వార్తల్లో నిలిచాడు.
అందేంటంటే.. తాను తాళి ధరించాలని నిర్ణయించుకోవడం. అది కూడా పెళ్లి రోజు మూడు మూళ్లు వేసిన భార్యతోనే.. తన మెడలో తాళి కట్టించుకున్నాడు. ఇదేంటని అడిగితే పెళ్లి అనేది స్త్రీ, పురుషుల సమానత్వానికి ప్రతీక. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదండయో.. ఆ తాళిని ఇకపై ఎప్పుడూ తన మెడలోనే ఉంచుకుంటానని తెలిపాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకి చెందిన శార్ధుల్ కదమ్, తనుజ పాటిల్ అనే జంట నాలుగేళ్ల డేటింగ్ చేసిన తర్వాత గతేడాది డిసెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. స్త్రీవాది(ఫెమినిస్ట్) అయిన శార్ధుల్.. మొదటి నుంచి వివాహం అంటే సమానత్వానికి ప్రతీక అని నమ్మేవాడు. దాంతో దీనికి గుర్తుగా ఎదైనా ప్రత్యేకంగా చేయాలని నిర్ణయించుకున్నాడు.
అంతే.. శార్దుల్‌కు ఒక ఆలోచన వచ్చింది. తాను భార్య మెడలో మంగళసూత్రం కట్టినట్లు.. ఆమె తన మెడలో కూడా తాళి కట్టించుకోవాలని అనుకున్నాడు. పెళ్లికి ముందే ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వద్ద ప్రస్తావించాడు. మొదట వారు శార్దుల్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అదంతా జరగని పని అంటూ కొట్టిపడేశారు.
అయిన శార్దుల్ తన పంతా వీడలేదు. ఈ విషయంలో ఎలాగోలా కుటుంబ సభ్యులను ఒప్పించాడు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌లో శార్దుల్, తనుజ జంట పెళ్లి జరిగింది. ఇక పెళ్లి రోజు తనుజ మెడలో తాళి కట్టిన వెంటనే.. తన మెడలో కూడా ఆమెతో తాళి కట్టించుకున్నాడు. దాంతో ఈ పెళ్లి స్థానికంగా సంచలనంగా మారింది.
ఇంకేముంది ఆ తర్వాతి రోజు అక్కడి వార్త పత్రికల్లో కూడా ఈ న్యూస్ 'దుల్హే నే పెహనా మంగళసూత్ర'(తాళి ధరించిన వరుడు) అనే పేరిట ప్రచురితమైంది. అంతే.. ఆ తర్వాతి రోజు నుంచి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు శార్దుల్‌పై విరుచుకుపడ్డారు. 'ఇంకేందుకు ఆలస్యం శారీ కూడా కట్టుకో' అని కొందరు.. 'లింగ సమానత్వాన్ని చూపించడానికి ఇది సరియైన మార్గం కాదంటూ మరికొందరు కామెంట్ చేశారు.
ఇవే కాకుండా ఇంకా కొన్ని మాటల్లో చెప్పలేని కామెంట్స్ కూడా చేశారని శార్దుల్ చెప్పుకొచ్చాడు. వివాహమై నాలుగు నెలలు గడిచిన తాను ఇప్పటికీ తాళి బొట్టును తన మెడలోనే ఉంచుకున్నట్లు తెలిపారు. ఇకపై కూడా తీయబోనని శార్దుల్ పునరుద్ఘటించాడు. తాజాగా ఇన్‌స్టాగ్రాం వేదికగా తన పెళ్లి గురించి శార్దుల్ మరోసారి వివరణ ఇచ్చాడు. దీంతో కొందరు నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.