కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా నిలిపివేసివున్న ముంబై లోకల్ ట్రైన్స్ ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ రైళ్లలో ప్రయాణించాలంటే స్పెషల్ రైల్వే పాస్ పొందాల్సివుంటుంది. అలాగే, కరోనా నియంత్రణకు రెండు డోస్‌ల వ్యాక్సిన్ వేయించుకున్న వారు మాత్రమే లోకల్ ట్రైన్లలో ప్రయాణించొచ్చు.
కానీ, రెండో డోస్ వేయించుకున్న తర్వాత 14 రోజులకు మాత్రమే అనుమతినిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ క్రియేట్ చేశారు. ఈ యాప్ ద్వారా స్థానిక వార్డు కార్యాలయాల్లో స్పెషల్ రైల్వే పాస్ పొందాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు లేని వారు ఆఫ్‌లైన్‌లో పాస్ తీసుకోవాలి.
కాగా, మహారాష్ట్రలో కరోనా రెండో వేవ్ తారా స్థాయికి చేరుకోవడంతో గత ఏప్రిల్ నుంచి సబర్బన్ లోకల్ రైళ్లలో సాధారణ ప్రయాణికులకు అనుమతి నిలిపేశారు. ప్రస్తుతం ప్రభుత్వోద్యోగులు, అత్యవసర సర్వీసుల ఉద్యోగులు మాత్రమే లోకల్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు ముంబైలో 19 లక్షల మందికి పూర్తిగా వ్యాక్సినేషన్ పూర్తయిందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.