దేశ ఆర్థిక రాజధానిలో ప్రధానమైన ప్రజా రవాణా వ్యవస్థ సబర్బన్ రైళ్లు(లోకల్ ట్రైన్స్). ప్రతి నిత్యం కొన్ని లక్షల మంది ఈ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, కరోనా నేపథ్యంలో ఎన్నో రోజులుగా నిలిచిపోయిన లోకల్ రైళ్లు ముంబైలో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
అయితే ఈ రైళ్ళలో ప్రయాణం చేయాలనుకునేవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి కావాలి. అది కూడా రెండో డోసు వేసుకుని 15 రోజులు పూర్తయితేనే రైళ్ళలో ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి.
రైళ్లలో ప్రయాణం చేయాలని భావించేవారు మాస్క్, శానిటైజర్, వ్యక్తిగత శుభ్రత, స్టేషన్‌లో పాటించాల్సిన నియమాలను మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడి చేసింది. ఈ నెల 12 నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. దీనికోసం ప్రత్యేక రైలు పాస్ తయారు చేస్తున్నారు.
ఇంకా ఒక ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించనున్నారు. లోకల్ రైళ్ళలో ప్రయాణం చేసే వ్యక్తులు, తమ వ్యాక్సినేషన్ వివరాలను ఆ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాతే లోకల్ రైళ్ళలో ప్రయాణం చేయవచ్చు. అలాకాకుండా ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తే మాత్రం భారీ జరినామా తప్పదు.