Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కనీస ధరపై తక్షణం చట్టం చేయలేం : కేంద్ర మంత్రి అర్జున్ ముండా

arjun munda

ఠాగూర్

, మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (20:31 IST)
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో రైతన్నలు మంగళవారం చేపట్టిన ఢిల్లీ ఛలో ఉద్రిక్తంగా మారింది. పంజాబ్‌ నుంచి ఢిల్లీ ట్రాక్టర్లతో బయల్దేరిన అన్నదాతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రైతుల నిరసనపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్‌పీపై తక్షణమే చట్టం తీసుకురాలేమన్నారు. దీనిపై రైతు సంఘాలు చర్చలకు రావాలని కోరారు.
 
'కొన్ని శక్తులు (విపక్షాలను ఉద్దేశిస్తూ) తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ఆందోళనను ఉపయోగించుకుంటున్నాయి. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. కనీస మద్దతు ధరపై హడావుడిగా చట్టాన్ని తీసుకురాలేం. దీనిపై అన్ని వర్గాల వారితో సుదీర్ఘ సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అందుకే, రైతు సంఘాలు ఆందోళన విరమించి ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చల కోసం రావాలి' అని అర్జున్‌ ముండా సూచించారు.
 
ఈ ఆందోళన అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్‌కేఎం (రాజకీయేతర) నేత జగ్జీత్‌సింగ్‌ డల్లేవాల్‌, కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్‌ పంధేర్‌ తదితరులతో సోమవారం చర్చలు జరిపింది. రైతులు చేసిన డిమాండ్లలో కొన్నింటికి మంత్రుల బృందం అంగీకారం తెలపగా.. ఎంఎస్‌పీకి చట్టబద్ధతపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు.
 
మరోవైపు, రైతుల ఆందోళన విషయంలో భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. అన్నదాతల నిరసనను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో కనీస మద్దతు ధర చట్టబద్ధతపై హామీ ఇచ్చింది. 'రైతు సోదరులారా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం ప్రతి రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇది 15 కోట్ల రైతు కుటుంబాల జీవితాలను మారుస్తుంది. న్యాయం కోసం మేం ఎంచుకున్న మార్గంలో ఇదే మా తొలి గ్యారెంటీ. #KisaanNYAYGuarantee' అని పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్... మేడిగడ్డకు ఎందుకుపోయారు…? ఏముంది అక్కడ బొందల గడ్డనా…!? అంటుండ్రు : సీఎం రేవంత్