కరోనా ముక్కుపచ్చలారని పసి ప్రాణాలను తీసింది. తాజాగా నాలుగు నెలల చిన్నారిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని మంజేరికి చెందిన నాలుగు నెలల చిన్నారికి అధిక జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో తల్లిదండ్రులు ఈ నెల 21న కోజికోడ్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు.
పరీక్షల అనంతరం బుధవారం పాపకు కరోనా పాజిటివ్‌గా తేలింది. చికిత్స పొందుతున్న చిన్నారి శుక్రవారం ఉదయం మరణించింది. అయితే గత 3 నెలలుగా చిన్నారి గుండె సంబంధిత సమస్యలకు పోరాడుతోందని వైద్యులు తెలిపారు. ఇక మలప్పురం జిల్లాలో ఇప్పటి వరకు 20 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది.
కేరళలో గురువారం కొత్తగా కేవలం 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 447 ఉండగా ఆక్టివ్ కేసుల సంఖ్య 129 గా ఉంది. అంతేగాక 23 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.