దాచుకున్న డబ్బును కొట్టేశాడని తండ్రిని చంపి, వడదెబ్బ కొట్టి చనిపోయాడని కొడుకు నమ్మించిన ఘటన తమిళనాడులో జరిగింది. శవాన్ని పోస్ట్‌మార్టం చేయగా నిజం వెలుగులోకి రావడంతో నిందితుడు లొంగిపోయాడు. ఆంధ్ర సరిహద్దుల్లోని ఊత్తుకోట సెండ్రాంపాళ్యంలో ఉండే క్రిట్టినన్ అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
వ్యవసాయ కూలీగా జీవనం సాగించే ఇతను మద్యానికి బానిస అయ్యాడు. మద్యం త్రాగేందుకు డబ్బులు లేకపోవడంతో పెద్ద కొడుకు చిరంజీవి దాచుకున్న మూడు వేల రూపాయలను కాజేశాడు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొడవ పెద్దపై చిరంజీవి క్రిట్టినన్‌ను గొంతు నులిమి చంపేశాడు.
మూడురోజుల క్రితం వడదెబ్బ తగిలి తండ్రి మరణించినట్లుగా పెన్నాలూరుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించగా కారణం వెలుగుచూసింది. దాంతో పోలీసులు చిరంజీవిని నిలదీసి నిజం రాబట్టారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.