అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చుతున్న ప్రధాని నరేంద్ర మోడీని గద్దెదించి గుజరాత్‌కు పంపిచడం ఖాయమని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. సేవ్ ఇండియా నినాదంతో కోల్‌కతా వేదికగా ఆమె చేపట్టిన దీక్ష మంగళవారం విరమించుకున్నారు. ఆమె చేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్షను విరమింపజేశారు.
ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, ఈ ధర్నా రాజ్యాంగ, ప్రజాస్వామ్య, ప్రజల విజయమన్నారు. ఒక పోలీసు అధికారి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతోందని ఆమె నిలదీశారు. కోల్‌కతా పోలీస్ కమిషషన్ రాజీవ్ కుమార్ ఈ ధర్నా స్థలానికే రాలేదని, ఈ ధర్నాలో ఆయన పాల్గొన్నట్టు కేంద్రం తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై ఆమె విమర్శలు చేశారు. మోడీని గద్దె దింపి గుజరాత్‌కు పంపించడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను దేశవ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, కొన్ని అంశాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంటాయని ఆయన గుర్తుచేశారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరినీ నియంత్రించాలని చూస్తున్నారని, మోడీ, అమిత్ షా మినహా అందరూ అవినీతి పరులనే ముద్ర వేస్తున్నారని, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రమాదంలో పడిందని, అన్యాయంపై పోరాడేందుకు తామంతా ఏకతాటిపై ఉన్నామన్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు తలపిస్తున్నాయనీ, అందుకే రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి పని చేస్తామని తెలిపారు.