మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మొసలిని గ్రామస్థులు చిత్రహింసలకు గురిచేశారు. బాలుడిని మింగేసిందన్న అనుమానంతో గ్రామస్థులు ఈ పనికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ష్యోపుర్ జిల్లా రిఝెంటా గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు అతర్ సింగ్ సోమవారం చంబల్ నదిలో స్నానానికి వెళ్లాడు. కాసేపటి తర్వాత కనిపించకుండా పోయాడు. బాలుడిని మొసలి మింగేసిందని గ్రామస్థులంతా అనుకున్నారు. ఓ వల తెచ్చి దాన్ని పట్టుకున్నారు. ఒడ్డుకు లాక్కొచ్చి తాళ్లతో కట్టేశారు.
బాలుడికి ఆక్సిజన్ అందడం కోసమని మొసలి నోరు తెరిచి ఉంచేలా పెద్ద కర్ర పెట్టారు. చివరకు పొట్ట చీల్చి, బాలుడిని బయటకు లాగడానికి ప్రయత్నిస్తూ చిత్రహింసలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు.. గ్రామస్థులకు నచ్చజెప్పి.. మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు. బాలుడి కోసం గాలించగా.. మంగళవారం నదిలో శవమై కనిపించాడు.