Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..!

election commission

వరుణ్

, మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (18:37 IST)
సార్వత్రిక ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. మార్చి 9వ తేదీ తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
 
దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూకాశ్మీర్‌‌లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇందుకోసం మార్చి 8-9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ బృందం సమావేశం కానున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. 
 
జమ్మూకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, బలగాలపై అందులో చర్చించనున్నారు. ఆ తర్వాత మార్చి 12-13 తేదీల్లో ఈసీ బృందం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించనుంది. లోక్‌సభతో పాటే స్థానిక అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మార్చి రెండోవారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
 
గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్‌ జరిగింది. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్‌ - మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గెలాక్సీ బుక్ 4 సిరీస్ కోసం ప్రీ-బుక్‌ని తెరిచిన శాంసంగ్