తమ డిమాండ్ల పరిష్కారం చేపట్టిన రైతుల ఆందోళన మళ్లీ మొదటికొచ్చింది. డిమాండ్ల పరిష్కార చర్యల్లో భాగంగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డిమాండ్లను రైతుల సంఘాల సమాఖ్య నేతలు తోసిపుచ్చారు. దీంతో మళ్లీ ఢిల్లీ ఛలో కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో వారు మళ్లీ ఆందోళనబాట పట్టారు. అన్నదాతలు అంగీకారం తెలిపితే మొక్కజొన్న, పత్తి, మూడు రకాల పప్పు దినుసులను ఐదేళ్లపాటు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ మేరకు రైతు సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పంథేర్ సోమవారం పొద్దుపోయాక కీలక ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర మంత్రుల బృందం చేసిన ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదని తెలిపారు. రైతులు బుధవారం నుంచి తిరిగి నిరసన కొనసాగించనున్నారని, శాంతియుతంగా ఢిల్లీ వైపు మార్ను మొదలుపెడతారని చెప్పారు. పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభులో రైతుల సంఘాల మధ్య చర్చల అనంతరం పంథేర్ ఈ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తాము పూర్తిగా పరిశీలించామని, కనీస మద్దతు ధరను కేవలం రెండు మూడు పంటలకు మాత్రమే వర్తింపజేయడం సమంజసం కాదని మరో రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పేర్కొన్నారు.
ఇతర పంటలు పండించే రైతులకు కేంద్రం చేసిన ప్రతిపాదన వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పప్పు దినుసులపై కనీస మద్దతు ధరకు హామీ ఇస్తే రూ.1.5 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్ర మంత్రి అన్నారని, అయితే వ్యవసాయ పంటల ధర కమిషన్ మాజీ ఛైర్మన్ ప్రకాష్ కమ్మర్ది అధ్యయనం ప్రకారం అన్ని పంటలకు ఎంఎస్పీ వర్తింపజేస్తే మొత్తం వ్యయం రూ.1.75 లక్షల కోట్లు అవుతుందని జగ్జిత్ సింగ్ దల్లేవాల్ పేర్కొన్నారు. దేశంలోకి పామాయిల్ దిగుమతి కోసం ప్రభుత్వం ఏకంగా రూ.1.75 లక్షల కోట్లు వెచ్చిస్తోందని, ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమన్నారు. అదే మొత్తాన్ని రైతులు నూనెగింజలు పండించడంలో సాయం చేయవచ్చునని సూచించారు.
పంటల వైవిధ్యాన్ని ఎంచుకునే రైతులకు మాత్రమే ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని భావిస్తోందని, ఎంఎస్పీ కింద హామీ ఉన్న పంటలను మాత్రమే పండించాలనే ప్రయత్నం చేస్తోందని దల్లేవాల్ ఆరోపించారు. ఇప్పటికే సాగు చేస్తున్న పంటలకు కనీస మద్దతు ధర వర్తింపజేయాలని అన్నారు. కొన్ని పంటలకు మాత్రమే ఎంఎస్పీ ఇస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, మొత్తం 23 పంటలకు వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస మద్దతుతో ఆదాయం పెరగదని, రైతుల జీవనోపాధికి అక్కరకొస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.