కుంభకర్ణుడు అనే రాక్షసుడు ఏడాదిలో ఏకబిగిన ఆర్నెల్లు నిద్రపోతాడనేది పురాణగాథ. సుదీర్ఘ నిద్రలో కుంభకర్ణుడినే తలదన్నెవాడొకడు రాజస్థాన్‌లో ఉన్నాడు.
అతడు నెలల లో వరుసగా 25 రోజులు నిద్రలోనే గడుపుతాడు. అంటే ఏడాదిలో 300 రోజులు గుర్రుపెడతాడన్నమాట. సంవత్సరంలో ఓ యాభై రోజులు మాత్ర మే స్పృహలో ఉంటాడు. నిద్రాదేవి ఇంతలా ఆవహించిన ఆయన 42 ఏళ్ల పుర్కారామ్! ఊరు నాగౌర్.
ఈ నిద్ర ఆయన కోరుకున్నది కాదు. ఆక్సిస్ హైపర్ సోమ్నియా అనే స్లీపింగ్ డిజార్డర్‌తో ఆయన బాధపడుతున్నారు. 25 రోజుల తర్వాత నిద్రలేచినప్పుడే ఆయనకు స్నానం చేయించి భోజనం పెడుతున్నారు కుటుంబసభ్యులు!
23 ఏళ్ల వయసులో ఆయన ఈ అరుదైన వ్యాధి బారినపడ్డారు. తొలుత రోజులో 15 గంటలు నిద్రపోయేవాడు. తర్వాత ఆ సమయం పెరుగుతూ పెరుగుతూ నెలలో 25 రోజుల పాటు నిద్రావస్థలోనే గడిపేస్థాయికి చేరుకున్నారు. అన్నట్టు.. పుర్కారామ్‌కు పెళ్లయింది. తన భర్త త్వరలోనే కోలుకుంటాడన్న ఆశాభావాన్ని భార్య వ్యక్తం చేశారు.