ప్రజలకు దిశా నిర్దేశం చేసిన మహనీయుల జీవితాల గురించి ముందు తరాలు తెలుసుకోవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. హైదరాబాద్ లో పలువురు రచయితలు తమ పుస్తకాలను ఉపరాష్ట్రపతికి అందజేశారు.
ముఖ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన వివిధ పుస్తకాలను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఉప రాష్ట్రపతికి అందజేశారు. పీవీపై పరిశోధనాత్మకంగా ఈ పుస్తకాలను ప్రచురించే చొరవ తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉప రాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు.
దక్కను ప్రాంతంలోని ఉర్దూ రచయితల జీవిత విశేషాలను తెలియజేస్తూ, ప్రముఖ పాత్రికేయులు ఇఫ్తేకార్ రచించిన జెమ్స్ ఆఫ్ డక్కన్ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. శ్రీరాముణ్ని ఆదర్శ పురుషునిగా చూపిన 16 గుణాలను వివరిస్తూ, సత్యకాశీ భార్గవ రాసిన మానవోత్తమ రామ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి స్వీకరించారు. నల్గొండ కథలు పుస్తకాన్ని యువ రచయిత మల్లికార్జున్ ఉప రాష్ట్రపతికి అందజేశారు. కథలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలన్న ఆయన, ప్రజల జీవన విధానాన్ని, మనసులను పుస్తకంలో ఆవిష్కరించిన రచయితకు అభినందనలు తెలియజేశారు.