కేరళ రాష్ట్రంలోని కాలామస్సేరిలోని ఓ కన్వెన్షన సెంటరులో ఆదివారం ఉదయం బాంబు పేలుడు ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో 36 మంది గాయపడ్డారు. కాలామస్సేరి నెస్ట్ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటరులో ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు జరిగిన సమయంలో చర్చిలో అనేక మంది ఉన్నట్టు సమాచారం.
ప్రత్యక్ష సాక్షులు మాత్రం కన్వెన్షన్ హాల్లో మూడు నుంచి నాలుగు పేలుళ్లు జరిగాయని చెబుతున్నారు. కన్వెన్షన్ హాలులో దాదాపు 2,500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ప్రార్థన సమయంలో వీరంతా కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగింది.
అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో క్షతగాత్రులను తరలించడంలో కొంత జాప్యం చోటు చేసుకొంది. ఈ పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
పేలుళ్లలో గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జి ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధితులను కాలామస్సేరి మెడికల్ కాలేజీ, ఎర్నాకులం జనరల్ హాస్పిటల్, కొట్టాయం మెడికల్ కాలేజీలకు తరలిస్తున్నారు.