ఆలయాల నగరంగా ప్రసిద్ధిగాంచిన తమిళనాడు రాష్ట్రంలోని మదురైలోని రైల్వే స్టేషన్‌లో ఆగివున్న పర్యాటక రైలులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ రైలులోని ప్యాంట్రీకార్‌లో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో మొత్తం 10 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. మరికొందరు గాయపడ్డారు.
లక్నో నుంచి రామేశ్వరం ప్రాంతాలను కలుపుతూ రైల్వే శాఖ పర్యాటక రైలును నడుపుతుంది. ఈ రైలు మదురై స్టేషన్‌కు వచ్చి ఆగింది. శనివారం ఉదయం రైలులోని ప్యాంట్రీకార్‌లో వంట పనుషులు తేనీరు పెట్టేందుకు గ్యాస్ స్టౌ వెలిగించారు. ఆ సమయంలో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో తొలుత ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చినప్పటికి ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని మదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.