భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అభివనందించారు. ఆయన తన విదేశీ పర్యటనను ముగించుకుని శనివారం బెంగుళూరుకు చేరుకున్నారు. అక్కడ ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన కలుసుకుని ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇస్రో సాధించిన విజయం భారత్‌కు చాలా గర్వకారణమన్నారు. మంగళ్‌యాన్, చంద్రయాన్ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ విజయాల స్ఫూర్తితో గగన్‌యాన్‌కు సిద్ధమవుదామని సూచించారు.
ఈ సందర్భంగా ప్రధానికి చంద్రయాన్-3 గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరించారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌తో పాటు ల్యాండర్, రోవర్ పని చేసే విధానం గురించి మోడీకి వివరించారు. ల్యాండర్ తీసిన తొలి ఛాయాచిత్రాన్ని మోడీకి అందజేశారు. ఆ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.
చంద్రయాన్ -3 సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో నా మనసంతా చంద్రయాన్-3 విజయంపైనే ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నాను. ఇస్రో సాధించింది సాధారణ విజయం కాదు. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్రను భారత్ సృష్టించింది. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉంది. భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని నిరూపించాం. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్నారు.
ఇస్రో సాధించిన విజయం ఎన్నో దేశాలకు స్ఫూర్తినిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతికత వైపు ప్రపంచం చూస్తోంది. చంద్రయాన్ -3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టుకుందాం. చంద్రయాన్-3 కృషిలో మహిళా శాస్త్రవేత్తలు ఉండటం గర్వకారణం. మన నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటాం. చంద్రయాన్-2 వైఫల్యంతో మనం వెనుకడుగు వేయలేదు. మరింత పట్టుదలతో పని చేసి చంద్రయాన్-3 విజయం సాధించామన్నారు.
ఇప్పుడు ప్రతి ఇంటిపైనే కాదు.. చంద్రుడిపైనా త్రివర్ణ పతాకం ఎగురుతోంది. 'మేకిన్ ఇండియా' ఇప్పుడు చంద్రుడి వరకు సాగింది. అంతరిక్ష విజ్ఞానంతో ఎన్నో ఫలితాలు అందుకోవాలి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఈ విజ్ఞానం ఉపయోగపడాలి. తుఫానులను అంచనా వేయడంలో మరింత నైపుణ్యం సాధించాలి. వాతావరణ మార్పులను మరింత ఖచ్చితంగా తెలుసుకునేలా పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ప్రధాని మోడీ కోరారు. అలాగే, ఆగస్టు 23వ తేదీని ఇకనుంచి 'నేషనల్ స్పేస్ డే'గా ఆయన ప్రకటించారు. ఇది చంద్రయాన్-3కి సక్సెస్‌గా ఈ నిర్ణయం తీసుకుందామని తెలిపారు.