కేరళలో వరదలు అందుకే ముంచేశాయ్.. వంద మంది మృతి
కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదలతో కేరళ ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వందేళ్ల తర్వాత కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఏర్పడిన వరదల కారణంగా వంద మంది ప్రాణాలు కోల్పోయా
కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదలతో కేరళ ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వందేళ్ల తర్వాత కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఏర్పడిన వరదల కారణంగా వంద మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ విపత్తుకు మానవ తప్పిదాలే కారణమని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు. పర్యావరణ విధ్వంసం కారణంగానే భారీ వరదలు జనావాసాలపై పోటెత్తుతున్నాయని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
కేరళలో భారీ వర్షాలు కురిసేందుకు కారణమయ్యే ఈ ప్రాంతంలో గతంలో దట్టంగా అడవులు వుండేవి. కానీ గత ప్రభుత్వాలు కొండలపై వున్న చెట్లను నరికి కాంక్రీటు పనులు చేపట్టాయి. టూరిస్టులను ఆకట్టుకోవడం కోసం చేసిన ఈ పనితో వరదలు కేరళను ముంచెత్తాయని.. ఈ ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని ఎదుర్కోనే సామర్థ్యం తగ్గిపోయిందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనికి తోడు విచ్చలవిడిగా నదుల్లో ఇసుకను తవ్వేయడం, వాతావరణ కాలుష్యం కలసి కేరళను ప్రస్తుత విపత్కర పరిస్థితిలోకి నెట్టాయని నిపుణులు చెబుతున్నారు.
కొండలపై కాంక్రీటు నిర్మాణాలు చేపట్టడంతో ఆ బరువును వదులుగా ఉన్న అక్కడి నేల తట్టుకోలేకపోయింది. వర్షానికి బాగా తడవగానే చాలా చోట్ల కుంగిపోయింది. దీంతో కొండచరియలు విరిగిపడి ఇడుక్కి, యర్నాకుళం సహా పలు జిల్లాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
1924 సంవత్సరంలో కేరళలో ఏకంగా 3,348 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత తాజాగా ఇప్పుడు 2,000 మిల్లీమీటర్ల కుంభ వృష్టితో కేరళ అతలాకుతలం అవుతోంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.