అప్పుడేమో ప్రజల కోసం వాజ్‌పేయి కన్నీళ్లు- ఇప్పుడేమో అటల్ జీకి ప్రజల వీడ్కోలు..
గొప్ప వక్త, రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ప్రమాణస్వీకారానికి ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కన్నీరుపెట్టుకున్నారు. ఆ సందర్భంలో వాజ్‌పేయీని ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ జర
గొప్ప వక్త, రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ప్రమాణస్వీకారానికి ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కన్నీరుపెట్టుకున్నారు. ఆ సందర్భంలో వాజ్‌పేయీని ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ జర్నలిస్టు రాజీవ్ శుక్లా ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ మాజీ ప్రధాని మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
1996లో వాజ్‌పేయీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు ఆయన్ని తాను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. ఆ సందర్భంలో ఆయనతో నేను ఇలా అన్నాను.. ''వాజ్‌పేయీజీ ఇప్పుడు మీరు ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రేపటి నుంచి మీరు భారీ భద్రత మధ్య ఉంటారు. ఇక మీరు ప్రజలను దూరం నుంచే కలవగలరు’ అని చెప్పాను. నేను ఇలా మాట్లాడుతుండగానే ఆయన ఏడ్చేశారు'' అని శుక్లా అప్పటి సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
ప్రధానిగా వాజ్‌పేయీ ప్రతిఒక్కరితో కలిసి పనిచేసేవారని, ఆయన పాలనలో ప్రతిపక్షాలు కూడా సౌకర్యంగా ఉండేవని శుక్లా అన్నారు. అందుకే దేశంలోని ప్రతిఒక్కరూ వాజ్‌పేయీని ఎంతగానో ప్రేమిస్తారన్నారు. నేటితరం నాయకులు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని శుక్లా చెప్పుకొచ్చారు.
కాగా అప్పుడల్లా ప్రజల కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు.. అటల్ జీ. ప్రస్తుతం ప్రజలు అటల్ జీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని బాధపడుతున్నారు. మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఢిల్లీలోని దీన్‌దయాళ్ మార్గ్‌లోని భాజపా ప్రధాన కార్యాలయం నుంచి అంతిమ యాత్ర మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభమైంది.
యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ వద్ద ప్రభుత్వం లాంఛనాలతో వాజ్‌పేయీ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. దీనికోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భరత జాతికి విశేష సేవలందించిన వాజ్‌పేయి ఇక యమునా నదీ తీరాన సేద తీరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా వాజ్‌పేయీ అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు.
నెహ్రూ స్మారక స్థలం శాంతి వనం, లాల్‌బహుదూర్ శాస్త్రి స్మారకం విజయ్ ఘాట్ మధ్యలో రాష్ట్రీయ స్మృతి స్థల్ ఉంది. 2012లో మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్ అంత్యక్రియలు కూడా స్మృతి స్థల్‌లోనే జరిగాయి.