ఓ ముస్లిం యువతి పహారీ భాషలో రామ్ భజనను ఆలపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఆ యువతి పేరు సయ్యద్ బటూల్ జెహ్రా. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఈ యువతికి వయసు 19 యేళ్లు. పహారీ భాషలో ఆమె ఆలపించిన రామ్ భజన పాటకు నెటిజన్లు సైతం ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ మహత్తర ఘట్టం కోసం కోట్లాది మంది వేచి చూస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రాముడు... రామమందిరం గురించే చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ ముస్లిం యువతి పాడిన రామ్ భజన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
దీనిపై ఆమె మాట్లాడుతూ... గాయకుడు జుబిన్ నౌటియాల్ హిందీలో పాడిన రామ్ భజన తనను పాడేందుకు ప్రేరేపించిందన్నారు. యూట్యూబ్‌లో హిందీలో జుబిన్ పాడిన రామ భజనను చూశానని... తొలుత హిందీలో పాడానని, బాగా నచ్చిందని.. దీంతో పహారీ భాషలో పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
దానిని హిందీ నుంచి పహారీలోకి అనువదించి రామ్ భజన పాడానన్నారు. తాను ముస్లి అయినప్పటికీ రామ్ భజన పాడటం తప్పేమీ కాదన్నారు. తమ లెఫ్టినెంట్ గవర్నర్ ఓ హిందూ అని.. కానీ ఆయన అభివృద్ధి విషయంలో మతాన్ని చూడరన్నారు. హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు అందరూ సోదరులేనని తాను నమ్ముతానని పేర్కొన్నారు.