వారిద్దరూ వైద్యులే. వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత వారిమధ్య వచ్చిన మనస్పర్థలు కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, భార్య ఎడబాటుతో భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. భార్యను కాపురానికి పంపాలంటూ పలుమార్లు అత్తమామల వద్ద ప్రాధేయపడ్డాడు. కానీ, వారు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతే.. సైకోగా మారిపోయిన వైద్యు.. కత్తితో అత్తమామలపై దాడి చేశారు. భర్తను అడ్డుకునేందుకు వచ్చిన భార్య కూడా తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని హుబ్లీ జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శంకర్ అనే వ్యక్తి ముసన్నవర్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్‌గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఈయన హుబ్లీ లింగరాజునగరులో ఉన్న తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు.
ఈ క్రమంలో శనివారం ఉదయం వాకింగ్ వెళ్లడానికి సిద్ధమవుతుండగా అల్లుడు సంతోష్ చొరబడి కత్తితో విచ్చలవిడిగా దాడిచేశాడు. కత్తిపోట్లతో శంకర్ అక్కడికక్కడే మరణించగా ఆయన భార్య, కుమార్తె లతకు గాయాలయ్యాయి. అరుపులతో అప్రమత్తమైన స్థానికులు ఉన్మాది సంతోష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
అయితే, వైద్యుడైన సంతోష్ ఇలా ఉన్మాదిగా మారడానికి ఆయన భార్య కాపురానికి రాకపోవడమేనని పోలీసులు తేల్చారు. సంతోష్, భార్య లతల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అప్పటికీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ వారి మధ్య సయోధ్య కుదరలేదు. వీరిద్దరు వైద్యులు అయినప్పటికీ కాపురాన్ని చక్కదిద్దుకోలేక పోయారు. దీంతో లత భర్తను వీడి తన పుట్టింటికి వెళ్లింది.
తల్లిదండ్రులతో ఆమె నివసిస్తూ అక్కడే ఒక ప్రైవేట్ వైద్య కాలేజీలో పని చేస్తూ వస్తోంది. దంత వైద్యుడైన సంతోష్ భార్యను తన వద్దకు పంపాలని అప్పుడప్పుడు మామ ఇంటికి వచ్చి ఘర్షణ పడసాగాడు. అయినప్పటికీ వారు సంతోష్ మాటలను పట్టించుకోలేదు. దీంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.