కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది జలసమాధి అయ్యారు. ఈ విషాదం మాండ్యా జిల్లాలోని కనగణమరడి గ్రామంలోని నీటి కాల్వలో పడిపోయింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే,
మాండ్యా నుంచి పాండవపుర వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి కావేరీ నది వీసీ కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సు పూర్తిగా నీటమునిగిపోయింది. ఈ ఘటనలో పాఠశాల విద్యార్థులు సహా 20 మంది మృతిచెందారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కొందరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.