కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అధిష్టానం పోటీ చేసేందుకు టిక్కెట్ నిరాకరించడంతో పలువురు సీనియర్ నేతలు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అలాంటి వారిలో సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ఒకరు. ఈయన సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు.
ఇప్పటికే మూడు రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెల్సిందే. ఇపుడు జగదీష్ షెట్టర్ వంతు వచ్చింది. ఆయన సోమవారం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటారు.
బీజేపీలో సీటు రాని ఆశావహులు, తన అనుచరులతో కలిసి ఆదివారం రెండు విమానాల్లో హుబ్బళ్లి నుంచి బెంగుళూరుకు చేరుకున్న జగదీష్.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
కాగా, హుబ్బళ్ళి - ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన షెట్టర్‌కు ఈసారి టిక్కెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం నిరాకరించింది. పైగా, ఆ స్థానం నుంచి కొత్త వారిని బరిలోకి దించాలన్న స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. దీంతో పార్టీపై అధిష్టానంపై అలిగిన ఆయన... బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.