మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగుసార్లు విచారణ పూర్తి చేసిన సీబీఐ ఇపుడు మరోమారు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, వివేకా హత్య కేసులో ఆదివారం తెల్లవారుజామున అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరయ్యే అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్టు చేసే అవకాశం లేకపోలేదన్న ప్రచారం సాగుతోంది. దీంతో నేడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచగా, జడ్జి.. 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‍గూడ జైలుకు తరలించారు. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన వెంటనే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.