మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడు ప్రదర్శించారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒకరైన కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పులివెందులలో భాస్కర్ రెడ్డి అదుపులోకి తీసుకున్న అధికారులు... కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, శుక్రవారం నాడు కూడా కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
కాగా, అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన సీబీఐ... వివేకా హత్య కేసుతో ఆయనకు కూడా సంబంధం ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇపుడు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.