కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీకావడంతో బరిలో ఉన్న రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాలైన హామీలను గుప్పిస్తున్నాయి. ఇందులోభాగంగా, రైతులను ఆకట్టుకొనేందుకు జేడీ(ఎస్) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఓ వినూత్న హామీ ఇచ్చారు. రైతుల కుమారులను వివాహం చేసుకొనే మహిళలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రకటించారు. కోలార్‌లో జరిగిన పంచరత్న ర్యాలీలో ఆయన ఈ మేరకు ప్రకటించారు.
ఆ ర్యాలీలో కుమార స్వామి మాట్లాడుతూ రైతు బిడ్డలతో పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు యువతులకు ప్రభుత్వం రూ.2 లక్షలు నజరాన ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల కుమారులను పెళ్లి చేసుకోవడానికి యువతులు సిద్ధంగా లేరంటూ తనకు వినతిపత్రం అందిందన్నారు. 'రైతుల కుమారుల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం యువతులకు రూ.2 లక్షలు ఇవ్వాలి. మా కుర్రాళ్ల ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు ఈ పథకాన్ని మేము ప్రవేశపెట్టనున్నాం' అని కుమారస్వామి హామీ ఇచ్చారు.
కర్ణాటకలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మే 10వ తేదీన ఒకే విడతలో రాష్ట్రం మొత్తం పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలను మే 13వ తేదీన ప్రకటించనున్నారు. జేడీఎస్ ఇప్పటికే 93 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో వైపు అధికార భాజపా నుంచి జాబితా వెలువడలేదు. నాలుగు రోజులుగా ఢిల్లీలోని భాజపా జాతీయ కార్యాలయంలో ఇందుకోసం కసరత్తు సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ రెండు జాబితాలను ఇప్పటికే విడుదల చేసింది.