స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది నాథూరామ్ గాడ్సే అంటూ వ్యాఖ్యానించి వివాదాల్లో చిక్కుకున్న మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్.. మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన పురాణాల్లో హిందూ అనే పదం ఎక్కడా లేదని, మనం భారతీయులం అంటూ వ్యాఖ్యానించారు.
ఓ తమిళ పద్యాన్ని ప్రస్తావిస్తూ.. అన్ని వర్గాల వారు శాంతియుతంగా కలిసి ఉండడం వల్ల అనేక లాభాలుంటాయని చెప్పుకొచ్చారు. '12 అళ్వార్లుగానీ, 63 మంది నయనార్లుగానీ హిందూ అనే పదాన్ని ఎక్కడా సూచించలేదు. మన దేశానికి వచ్చిన మొఘలులు లేదా అంతకంటే ముందు వచ్చిన విదేశీ పాలకులు ఆ పదాన్ని ఉపయోగించి ఉంటారు.
అదే సాంప్రదాయాన్ని బ్రిటీషు వారు కొనసాగించారు. మన గుర్తింపు మనకు ఉన్నప్పుడు.. బయటివారు ఇచ్చిన పేరును వాడుకుంటున్నామంటే ఎంత అజ్ఞానంలో ఉన్నాం. భిన్నత్వంతో విలసిల్లుతున్న మన దేశాన్ని ఒక మతానికి పరిమితం చేయడం రాజకీయంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా చేస్తున్న ఒక పెద్ద తప్పు. అన్న వర్గాలు కలిసి ఉంటే అనేక లాభాలుంటాయి' అని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.