దివంగత నేత, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సమన్లు జారీ చేసింది.. జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్. పన్నీర్ సెల్వంతో పాటు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, తమిళనాడు ఆరోగ్యశాఖ శాఖ మంత్రి విజయభాస్కర్, జయకు వైద్యం అందించిన అమెరికా వైద్యుడు రిచర్డ్ బీలేకు కూడా సమన్లు జారీ చేసింది.
జనవరి 8వ తేదీన పన్నీర్ సెల్వం హాజరు కావాలని, జనవరి ఏడో తేదీన విజయభాస్కర్, 11న తంబిదురై తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి 7న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని రిచర్డ్ బీలేకు సూచించింది. ఈ నెల 20న కూడా పన్నీర్ కు సమన్లు జారీ చేసినప్పటికీ... ఆయన హాజరుకాలేదు. దీంతో, తమ ఎదుట హాజరు కావాలంటూ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది.
కాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో 2016 డిసెంబర్ 5న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 75 రోజలపాటు చికిత్స పొందుతూ జయ మరణించారు. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తంమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్ 25న రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ అపోలో వైద్యులతో పాటు సుమారు 145 మంది సాక్షులను విచారించింది. ఇదిలా ఉంటే.. అమ్మ మృతిపై వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి పునఃవిచారణ జరపాలని అపోలో ఆస్పత్రి తరపున ఆర్ముగస్వామి కమిషన్ వద్ద వినతి పత్రం సమర్పించడం జరిగిన సంగతి తెలిసిందే.