జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. 24 గంటల వ్యవధిలో వరుసగా 4 ఉగ్రదాడులకు పాల్పడ్డారు. తాజాగా చోటుచేసుకున్న ఘటనలో ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్‌పై కాల్పులు జరపగా, అంతకు ముందు ఘటనల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానికేతర కూలీలు, సాధారణ పౌరులపై తూటాలు పేల్చారు.
ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో నాలుగు చోట్ల దాడులు జరిపారు. పుల్వామా తర్వాత రెండో ఘటన శ్రీనగర్‌లో చోటుచేసుకుంది. శ్రీనగర్ ఉగ్రదాడి ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ జవాను మృతిచెందాడు. మరో జవాను గాయపడ్డాడు. భద్రతా దళాల చెక్ పాయింట్ వద్ద ఈ ఘటన జరిగింది.
తాజాగా.. 24 గంటల వ్యవధిలో నాలుగో ఉగ్రదాడి ఘటన షోపియాన్ జిల్లాలో చోటుచేసుకుంది. షోపియాన్ జిల్లా ఛోటోగామ్ ప్రాంతంలో దుకాణం నిర్వహించే కశ్మీరీ పండింట్ వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
తీవ్రంగా గాయపడిన ఆయనను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ కశ్మీరీ పండిట్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ఘటనలపై అధికారులు ప్రకటన విడుదల చేయాల్సిఉంది.