చంద్రునిపై భవిష్యత్తులో జీవించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రునిపై నిర్మాణాలను చేపట్టడానికి వీలుగా ఉండే ఇటుకలను ఇస్రో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరు సంయుక్తంగా తయారు చేశాయి. ఈ ఇటుకల తయారీలో చంద్రుని మీద నుంచి తెచ్చిన మట్టి, కొన్ని రకాల బ్యాక్టీరియాలు, చిక్కుడు కాయల గుజ్జు ఉపయోగిస్తున్నారు.
ఇందులో ఉన్న బ్యాక్టీరియా జీవక్రియలో భాగంగా ఇటుకకు ఎక్కువ మన్నిక లభించేలా చేసే కొన్ని పదార్ధాలను విడుదల చేస్తాయి. ఇవి యూరియాతో చర్యలు జరిపి కాల్షియం కార్భైడ్ లాంటి పదార్ధాల తయారిలో ఉపయోగపడతాయి. అందుకే ఈ ఇటుకల తయారీలో మూత్రం ద్వారా తయారయ్యే యూరియాను కూడా ఉపయోగిస్తారు.
అంతరిక్ష పరిశోధనలు గత శతాబ్ధ కాలంలో విపరీతంగా పెరిగాయి. అక్కడ నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశారు. వీటిలో ఒక పౌండ్ ఇటుకలను స్పేస్‌కు చేర్చడానికి రూ. 7.5లక్షల ఖర్చు అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఖర్చు కాల క్రమేణా తగ్గుతుందని తెలిపారు. సాధారణంగా ఇటుకలను ఒకదానికి ఒకటి జత చేయడానికి సిమెంట్‌ను ఉపయోగిస్తారు.
కానీ ఈ ఇటుకలను కలపడానికి చిక్కుడు కాయల గుజ్జును ఉపయోగిస్తున్నారు. ఇది ఇటుకలను మరింత గట్టిగా పట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో త్వరలోనే చంద్రునిపై చేపట్టనున్న నిర్మాణాలలో భారత్ ప్రముఖ పాత్ర వహించనున్నట్లు అర్థం చేసుకోవచ్చు.