దేశం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనా విధానం అద్భుతంగా ఉందని నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. మంగళవారం ప్రధాన మంత్రిని ఆయన నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో కలిశారు. ఆ తర్వాత బెనర్జీ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రధాని తనతో మాట్లాడటానికి చాలా సమయం కేటాయించారన్నారు. అపూర్వమైన భారతదేశం గురించి తన ఆలోచనా తీరును ఆయన వివరించారని చెప్పారు. విధానాల గురించి వినేవాళ్ళు ఉంటారని, కానీ వాటి వెనుక ఉన్న ఆలోచనల గురించి వినేవాళ్ళు అరుదుగా ఉంటారన్నారు. ఆయన ప్రధానంగా పరిపాలన గురించి మాట్లాడారని తెలిపారు.
క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ఉండే అపనమ్మకం పరిపాలనపై ఎలా పడుతుందో వివరించారన్నారు. కాబట్టి పరిపాలన ప్రక్రియపై ఉన్నత వర్గాల నియంత్రణ వ్యవస్థలను సృష్టిస్తుందని, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని కాదన్నారు. ఈ ప్రక్రియలో తాను బ్యూరోక్రసీని ఏ విధంగా సంస్కరించేందుకు, మరింత బాధ్యతాయుతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నదీ మోడీ వివరించారని తెలిపారు.
అలాగే, అభిజిత్‌తో జరిగిన సమావేశం గురించి మోడీ ఓ ట్వీట్ చేశారు. బెనర్జీతో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. బెనర్జీ సాధించిన విజయాలపట్ల భారత దేశం గర్విస్తోందని అందులో పేర్కొన్నారు.
కాగా, ఈ నెల 14వ తేదీన ఇండో-యూఎస్ ఆర్థికవేత్త బెనర్జీకి నోబెల్ బహుమతి వరించింది. పేదరిక నిర్మూలపై వీరు చేసిన కృషికిగాను ఈ పురస్కారం వరించింది. ఈయన ఈ బహుమతిని ఫ్రెంచ్ ఆర్థికవేత్త ఎస్తేర్ డఫ్లో, అమెరికన్ ఆర్థికవేత్త మైఖేల్ క్రెమెర్‌లతో కలిసి పంచుకున్నారు.