ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రెండోసారి ప్రజలు పట్టంకట్టడంపై నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ నిజంగా ప్రజాదరణ కలిగినవారని, ప్రతిపక్షంలో సరైన నాయకుడు కనిపించకపోవడంతోనే ప్రజలు ఆయనకు ఓట్లేశారన్నారు.
ఆయన ఓ జాతీయ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 'ప్రజలు ఏకమొత్తంగా మోడీకి ఆమోదం తెలిపారు. ఎన్నికల విజయాన్ని ప్రభుత్వ విధానాలకు ఆమోదం తెలిపినట్లుగా భావించకూడదన్నారు. అభిజిత్ వామపక్షవాది అని, ఆయన ప్రతిపాదించిన 'న్యాయ్' పథకం ఎన్నికల్లో తిరస్కరణకు గురైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై అభిజిత్ స్పందిస్తూ.. 'మోడీకి ప్రజలు ఓట్లేశారు.. కానీ ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికీ కాదు' అని గుర్తుచేశారు.
'మోడీకి నిజంగానే ప్రజాదరణ ఉందని నేను భావిస్తున్నా. అయితే ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికీ ప్రజలు ఓట్లేశారని నేను అనుకోవడం లేదు. ఈ పథకానికి మోడీకి నేను ఓటేయాలి.. ఆ పథకానికి వేయకూడదు అన్న చాయిస్ ప్రజలకు లేదు. వారికి ఉన్నది ఒక్కటే చాయిస్.. మోడీనా.. కాదా?' అని అభిజిత్ అభిప్రాయపడ్డారు.
అదేసమయంలో దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 'ప్రస్తుతం దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం. ప్రజాస్వామ్యానికి ఇది మేలు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆ బాధ్యతను తీసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రజలు భావిస్తున్నట్లు నేను అనుకోవడం లేదు. ఆ పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడు లేడు. అధ్యక్షుడు ఎవరైనా, అతడికి బలమైన అధికారాలు ఇవ్వాలి. వారు కోరుకున్నట్లుగా పార్టీని నడిపించే స్వేచ్ఛనివ్వాలి' అని అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.