Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

దుబాయ్ జంప్ అయిన ఒమిక్రాన్ బాధితుడి సంగ‌తేంటి?

Advertiesment
indian priligrim
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:49 IST)
ఒమిక్రాన్ ఇపుడు దేశ దేశాలను హ‌డ‌లెత్తిస్తోంది. ఇపుడిపుడే అంద‌రూ అప్ర‌మ‌త్తం అవుతున్న వేళ‌, రోగుల ర‌హ‌స్య సంచారం క‌ల‌వ‌ర‌పెడుతోంది. భారత్‌లో తొలి ఒమిక్రాన్ రోగిగా గుర్తించిన 66 ఏళ్ల వ్యక్తి అర్ధరాత్రి వేళ దుబాయ్ చెక్కేయడం కలకలం రేపుతోంది. అతడు ప్రయాణించిన విమానంలో ఉన్న వారి పరిస్థితి ఏంటన్న విషయం అధికారుల్లో గుబులు రేపుతోంది.
 

 
 
గత నెల 20న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన బాధితుడు ఓ హోటల్‌లో దిగాడు. అతడికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొవిడ్ సోకినట్టు నిర్ధారణ కావడంతో హోటల్‌లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు. అతడు అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తి చేసుకున్నట్టు బెంగళూరు మునిసిపల్ అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికాలో అతడు కొవిడ్ నెగటివ్ రిపోర్టుతోనే ఫ్లైట్ ఎక్కినట్టు గుర్తించారు. అయితే, బెంగళూరులో మాత్రం అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా వైరస్ సోకినప్పటికీ అతడిలో లక్షణాలు లేవని గుర్తించిన వైద్యులు, సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. 
 
 
మరోవైపు, అప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఎందుకైనా మంచిదని నవంబరు 22న అతడి నుంచి నమూనాలు సేకరించి జినోమ్ సీక్వెన్సింగుకు పంపారు. ఆ నివేదికలు రాకముందే బాధితుడు ఓ ప్రైవేటు ల్యాబ్‌ను సందర్శించి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడ అతడికి నెగటివ్‌గా తేలింది. ఇంకోవైపు, అతడి ప్రైమరీ కాంటాక్ట్‌లు అయిన 24 మంది వ్యక్తులకు కూడా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో ఎలాంటి లక్షణాలు లేవని గుర్తించారు. అదే నెల 22, 23 తేదీల్లో బాధితుడి సెకండరీ కాంటాక్ట్‌లు అయిన 240 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించగా, వారికి కూడా కరోనా సోకలేదని నిర్ధారణ అయింది.
 
 
ప్రైవేటు ల్యాబులో చేయించుకున్న పరీక్షల్లో కరోనా లేదని స్పష్టం కావడంతో నవంబరు 27న అర్ధరాత్రి బాధితుడు హోటల్ నుంచి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్‌‌పోర్టుకు వెళ్లాడు. అక్కడ ఫ్లైటెక్కి దుబాయ్ వెళ్లిపోయినట్టు అధికారులు గుర్తించారు.
 
 
అతడితోపాటు ఒమిక్రాన్ వేరియంట్ సోకిన 46 ఏళ్ల బాధితుడిలోనూ స్వల్పంగా మాత్రమే లక్షణాలు ఉన్నట్టు అంతకుముందు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒమిక్రాన్‌పై భయాందోళనలు వద్దని ప్రజలకు సూచించింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోని వారు ఆలస్యం చేయకుండా టీకా తీసుకోవాలని సూచించింది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని, జనసమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది. కాగా, దుబాయ్ వెళ్లిపోయిన ఒమిక్రాన్ బాధితుడి పరిస్థితి ఏంటన్న విషయం తెలియరాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ నెల 20 నుంచి 24 వరకు బొల్లారంలో రాష్ట్రపతి విడిది