కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) గ్రీన్ పాస్ స్కీమ్‌లో చోటు కల్పించకపోతే తాము కూడా తగిన రీతిలో స్పందిస్తామని యూరోపియన్ యూనియన్‌కు కేంద్రం హెచ్చరించింది. ఈయూ దేశాల్లో వేస్తోన్న వ్యాక్సిన్లను భారత్ కూడా అంగీకరించబోదని, ఆయా దేశాల నుంచి ఇక్కడికి వచ్చేవారికి క్వారంటైన్‌ను తప్పనిసరి చేయనున్నామని వారికి తెలియజేసినట్టు విదేశాంగ శాఖకు చెందిన వర్గాలు పేర్కొన్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇందుకోసం భారత్‌లో తయారవుతున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లను యూరోపియన్ యూనియన్ ఇప్పటివరకు అంగీకరించలేదు. ఇది చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని యూరప్ దేశాలు తమ దేశాల్లోకి నేరుగా అనుమతించకుండా ఇబ్బందులు పెడుతుంది. దీనిపై భారత్ సీరియస్‌గానే స్పందించింది.
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్‌ను గుర్తించడంపై భారతదేశం పరస్పర విధానాన్ని ఏర్పాటు చేస్తుందని భారత విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. అంటే ఇండియన్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లను యూరోపియన్ యూనియన్ అంగీకరించేంత వరకూ.. ఆ దేశాల వ్యాక్సిన్ సర్టిఫికెట్లను కూడా భారత్‌లో కూడా అంగీకరించరు.
యూరప్ నుంచి భారత్‌కు వచ్చే వాళ్లు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే యూరోపియన్ యూనియన్.. డిజిటల్ కోవిడ్ సర్టిఫికెట్‌లో తప్పనిసరిగా కోవాగ్జిన్,కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను నోటిఫై చేయాలని ఈయూకి చెప్పడం జరిగిందని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.