Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#IAFLegendGroupCaptainDKParulkar :భారత యుద్ధ వీరుడు డీకే పారుల్కర్ ఇకలేరు...

Advertiesment
dk parulkar

ఠాగూర్

, సోమవారం, 11 ఆగస్టు 2025 (16:07 IST)
భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య 1971లో యుద్ధం జరిగింది. ఆ సమయంలో పాకిస్థాన్ సైన్యం చేతికి చిక్కి, ఆ తర్వాత వారి చెర నుంచి సాహసోపేతంగా తప్పించుకున్న యుద్ధ వీరుడు, భారత వాయుసేన మాజీ గ్రూపు కెప్టెన్ డీకే పారుల్కర్ భౌతికంగా దూరమయ్యారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఉన్న స్వగృహంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన కుమారుడు ఆదిత్య పారుల్కర్ స్పందిస్తూ, 'నా తండ్రి 82 సంవత్సరాల వయసులో పూణేలోని మా నివాసంలో ఉదయం గుండెపోటు కారణంగా మరణించారు' అని వెల్లడించారు. కాగా, ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
మరోవైపు, పారుల్కర్ మృతి పట్ల భారత వాయుసేన సంతాపం వ్యక్తం చేసింది. '1971 యుద్ధ హీరో, పాకిస్థాన్ చెర నుంచి సాహసోపేతంగా తప్పించుకుని అసామాన్య ధైర్యసాహసాలు, చాకచక్యం ప్రదర్శించిన గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ స్వర్గస్థులయ్యారు. వాయు యోధులందరి తరపున ఆయనకు హృదయపూర్వక నివాళులు' అని ఐఏఎఫ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. 
 
1971 యుద్ధంలో వింగ్ కమాండర్‌గా ఉన్న పారుల్కర్, పాకిస్థాన్‌కు యుద్ధ ఖైదీగా చిక్కారు. అక్కడ తన ఇద్దరు సహచరులతో కలిసి ఖైదీల శిబిరం నుంచి తప్పించుకునేందుకు సాహసోపేతమైన ప్రణాళిక రచించి, దానికి నాయకత్వం వహించారు. ఆయన దేశభక్తి, వాయుసేన పట్ల గర్వం అసాధారణమైనవని వాయుసేన కొనియాడింది. ఈ సాహసానికి గాను ఆయనకు విశిష్ఠ సేన పతకం లభించింది.
 
1965 యుద్ధంలోనూ ఆయన తన ధైర్యాన్ని ప్రదర్శించారు. శత్రువుల కాల్పుల్లో ఆయన విమానం దెబ్బతినడమేకాకుండా, కుడి భుజానికి గాయమైంది. విమానం నుంచి బయటకు దూకేయమని పైలట్ సూచించినా, ఆయన ఏమాత్రం జంకకుండా దెబ్బతిన్న విమానాన్ని సురక్షితంగా బేస్‌కు తీసుకువచ్చారు. ఈ సాహసానికిగాను ఆయనను వాయు సేన పతకంతో సత్కరించారు. 1963 మార్చిలో వాయుసేనలో చేరిన పారుల్కర్, ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌ సహా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kerala woman: టీచర్స్ ట్రైనింగ్ కోర్సు చేస్తోన్న విద్యార్థిని ఆత్మహత్య.. లవ్ జీహాదే కారణం