సీనియర్ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడారు. దీంతో ఆయనకు మద్దతుగా అనేక మంది ఆ పార్టీని వీడుతున్నారు. అంటే గులాం నబీ ఆజాద్ దెబ్బకు జమ్మూకాశ్మీర్‌లోని కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. తాజాగా ఏకంగా 64 మంది నేతలు రాజీనామా చేశారు.
పార్టీని వీడిన సీనియర్ నేతల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్, మాజీ మంత్రి అబ్దుల్ మాజిద్ వనీ, మనోహర్ లాల్ శర్మ, ఘారు రామ్ తదితరులు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఉమ్మడిగా లేఖ రాశారు.
"మా నేత, మార్గదర్శి గులాం నబీ ఆజాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన దారిలోనే మేం కూడా పార్టీని వీడాలని, ఒక సానుకూల రాజకీయ సమాజం కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆజాద్ ఒక జాతీయ పార్టీని జమ్మూకాశ్మీర్ కోసం ప్రారంభిస్తారు. మేమందరం ఆయనతో కలిసి ఆ పార్టీలో ప్రయాణించాలని, ఆయనకు మద్దతుగా నిలిచి కాశ్మీర్‌కు ఒక మంచి భవిష్యత్‌ను అందిస్తాం" అని ఆ లేఖలో పేర్కొన్నారు.