తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో బుధవారం చెన్నైతో పాటు.. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
కాగా, గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైతో పాటు.. నగర శివారు ప్రాంతాల్లో వర్షవు నీరు వచ్చి చేరింది. దీంతో నగరం అతలాకుతలమైపోయింది. బుధవారం సైతం భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే పుదుచ్చేరి, కారైక్కాల్, కడలూరు, విల్లుపురం, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రంలోని కోస్తా తీర జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీచేసింది.
మరోవైపు, దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. అక్కడ నుంచి దిశ మార్చుకుని గురువారం ఉదయానికల్లా ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా వచ్చే క్రమంలో తీవ్ర వాయుగుండంగా బలపడుతుంది. తర్వాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని 17వ తేదీ ఉదయానికి ఒడిశా తీరానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. అయితే ఈ తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం లేదని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదిలావుంటే, మంగళవారం నాటికి శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి దక్షిణ కోస్తాలో పలుచోట్ల, తమిళనాడులో వర్షాలు కురిశాయి. బుధవారం ఉత్తరకోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 16 నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనున్నందున బుధ, గురువా రాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.