భారీ వర్షాలతో కర్నాటక రాష్ట్రం తడిసి ముద్దయిపోతోంది. ఈ వర్షాల దెబ్బకు దేశ ఐటీ రాజధాని బెంగుళూరులోని అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి నగరం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోగా, రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వాహనాలు ఎక్కడివి అక్కడే బారులు తీరిపోయాయి. ఫలితంగా వాహనచోదకులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని పోయారు.
ముఖ్యంగా నగరంలోని బెళ్లందురు, సర్జాపురా రోడ్డు, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎంఎల్ లేఔట్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ వర్షాల ధాటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగుళూరు నగరంలో వరుణ దేవుడు విసిరిన జలఖడ్గానికి సంబంధించిన వీడియోలను అనేక మంది నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వచ్చే నాలుగు రోజుల్లో బీదర్, కలబురగి, విజయపుర, గడగ్, ధార్వాడ్, హవేరి, దావణగెరెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత వారం రోజులుగా బెంగుళూరు నగరానికి భారీ వర్షాలు ముంచెత్తున్న విషయం తెల్సిందే.
దీంతో నగరంలోని వేలాది గృహాలు నీట మునిగాయి. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు వీలులేక పోవడంతో ఆ నీరంతా లోతట్టు ప్రాంతాల్లోని గృహాల్లోకి చేరిపోతోంది. ఫలితంగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.