Publish Date: Mon, 08 Aug 2022 (09:15 IST)
Updated Date: Mon, 08 Aug 2022 (09:20 IST)
తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను వెల్లడించింది.
ఉపరితల ద్రోణికి అనుబంధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోని ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో గత రెండ్రోజులుగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
రానున్న మరో రెండు మూడు రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది.