ఇటీవల కాశ్మీర్ లోయలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పాకిస్థాన్ సైన్యం హస్తమున్నట్టు నిరూపించే బలమైన ఆధారాన్ని భారత భద్రతా బలగాలు సంపాదించాయి. ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా, అధికారులు కాశ్మీరులు వందలాది మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ క్రమంలోనే పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ ముసాకు పాక్ సైన్యంతో సంబంధం ఉందని తేలింది.
హషిమ్ మూసా పాక్ పారా కామాండ్ అని, లష్కర్ తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్టు దర్యాప్తు బృందాలు తేల్చాయి. తమ అదపులో ఉన్న 15 మంది ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్లు ముూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని కూడా ధృవీకరించారని అధికారులు వెల్లడించారు. ముసాతో పాటు ఈ దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు జునైద్ భట్, అర్బాజ్ మిర్ కూడా పాక్‌లో శిక్షణ పొందినట్టు గుర్తించారు.
పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూపు నుంచి హషీమ్ మూసా లష్కరేలోకి సహాయకుడిగా వచ్చినట్టు తెలుస్తోందని భద్రతా అధికారి ఒకరు వెల్లడించారు. ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధానికి ఇదే నిదర్శనమని చెప్పారు. పారా కమాండోలకు పాకిస్థాన్ అత్యాధునిక శిక్షణ ఇస్తోందని, కోవర్ట్ ఆపరేషన్‌లలో తీర్చిదిద్దుతోందని ఆరోపించారు. అత్యాధునిక ఆయుధాల వినియోగంపై శిక్షణ అందిస్తోందని వారు తెలిపారు.