Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో ముస్లిములపై వేధింపులు... మాజీ సీనియర్‌ అధికారుల ఆందోళన

Advertiesment
దేశంలో ముస్లిములపై వేధింపులు... మాజీ సీనియర్‌ అధికారుల ఆందోళన
, ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (10:58 IST)
ఏ రోగమైనా మతాన్ని బట్టి రాదు. అలాగనీ ఏ మతమూ రోగాన్ని వ్యాప్తి చేయదు. కానీ ఢిల్లీలోని తబ్లిగీ సమావేశం వల్ల జరిగిన పొరపాటు భారత్ లో ఏకంగా ఒక మతాన్నే దోషిగా నిలబెట్టింది.

దీనినే సాకుగా చూపుతూ అనేకమంది సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. అంతేనా బయటా రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వందమంది సీనియర్ అధికారులు ఆయా రాష్ట్రాలకు చెందిన సీఎంలకు లేఖ రాశారు.

కరోనా పేరుతో దేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లిములపై జరుగుతున్న వేధింపులపై దాదాపు 101 మంది మాజీ సీనియర్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాశారు. ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌ నిర్వహించిన కార్యక్రమాన్ని వారంతా ఖండించారు. ఇదే సమయంలో ఈ విషయంపై ఒక సెక్షన్‌ మీడియా అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు.

ముస్లిముల పట్ల శతృత్వాన్ని పెంచేలా కథనాలు ప్రసారం చేయడం పూర్తిగా బాధ్యతా రాహిత్యమని, గర్హనీయమని అభిప్రాయపడ్డారు. కరోనాతో ఏర్పడిన భయం, ఆభద్రతాభావం దారి తప్పుతోందని, ఇతర మతాల ప్రజలను రక్షించాలన్న పేరుతో బహిరంగ ప్రాంతాల నుంచి ముస్లిములను దూరంగా ఉంచడానికి ప్రయత్నం జరుగుతోందని మాజీ ఉన్నతాధికారులు తమ లేఖలో పేర్కొన్నారు.

దేశం మొత్తం భాధాకరమైన మార్గంలో ప్రయాణిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యంగా ఉండి ఒకరికొకరు సాయం చేసుకోవడం ద్వారానే కరోనా మహమ్మారి మనకు విసురుతున్న సవాళ్లను అధిగ మించగలమని వారు తెలిపారు. కరోనాపై పోరాటంలో లౌకికతత్వంతో వ్యవహరిస్తోన్న ముఖ్యమంత్రులను మాజీ అధికారులు ప్రశంసించారు.

లేఖ రాసిన మాజీ అధికారులందరూ అఖిల భారత, కేంద్ర సర్వీసులకు చెందినవారే.. వీరిలో మాజీ కేబినెట్‌ సెక్రటరీ కెఎం చంద్రశేఖర్‌, మాజీ ఐపిఎస్‌లు ఎఎస్‌ దౌలత్‌, జులియో రిబిరో, మాజీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ వజాహత్‌ హబీబుల్లా, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ తదితరులు ఉన్నారు.

తాము ఎటువంటి రాజకీయ ఉద్దేశంతో ఈ లేఖ రాయడం లేదని, ప్రస్తుతం భారత రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్లపై ప్రధానంగా దృష్టి సారించాలని కోరుతున్నామని తమ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లిగి జమాత్‌ కార్యక్రమం తర్వాత ముస్లిముల పట్ల వేధింపులు పెరిగాయని, దీనిపట్ల తాము చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో భౌతిక దూరం సూత్రాలకు విరుద్ధంగా జమాత్‌ కార్యక్రమం నిర్వహించారన్న విమర్శలు వస్తున్నాయని, ఈ కార్యక్రమానికి కొన్ని రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలు, ఒక సెక్షన్‌ మీడియా మతం రంగు పులిమాయని విమర్శించారు.

పలు ఆసుపత్రుల్లో, వైద్య సదుపాయాల కల్పన విషయంలో ముస్లిములకు దేశంలోని పలు ప్రాంతాల్లో వివక్ష ఎదురవుతోందని, ప్రభుత్వం నుంచి అందుతున్న రేషన్‌, నగదు బదిలీ వంటి లబ్ధిలోనూ ఇదేవిధంగా జరుగుతోందని తెలిపారు.

భారత్‌తో సఖ్యతగా మెలిగే పలు ముస్లిం దేశాలు కూడా దేశంలో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొంది. కరోనాకు సంబంధించి ఒక మతం పట్ల జరుగుతున్న అబద్ధపు ప్రచారంపై ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ, వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని మాజీ అధికారులు ముఖ్యమంత్రులను కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎఫెక్ట్.. విజయవాడ, నెల్లూరుజిల్లాలో మాంసపు దుకాణాలు బంద్