గోవా రాష్ట్రంలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి చనిపోయాడని భావించి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కానీ, చనిపోయాడని భావించిన వ్యక్తి మూడు నెలల తర్వాత తిరిగి ఇంటికి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
గోవా రాజధాని పనాజీ సమీపంలోని గ్రామంలో నివసించే మార్కోస్ మిలాగ్రేస్ (59) అనే వ్యక్తి గత 2023లో కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అదే ఏడాది అక్టోబరులో పోలీసులను ఆశ్రయించారు. అదే నెల 7న పనాజీలో పోలీసులకు ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అది మిలాగ్రేస్‌దేనని కుటుంబ సభ్యులు నిర్ధరించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించగా.. అంత్యక్రియలు నిర్వహించారు.
ఇది జరిగిన రెండు నెలల తర్వాత గోవా పోలీసులకు ముంబై నుంచి ఫోన్ వచ్చింది. ఓ వ్యక్తి తనను తాను మిలాగ్రేస్‌గా చెప్పుకొంటున్నట్లు సమాచారం అందించారు. దీంతో అతన్ని గోవా తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులను పిలిపించగా.. వారు మిలాగ్రేస్‌ను చూసి షాక్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆయన ముంబై వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. మిలాగ్రెస్ కుటుంబానికి ఎవరి మృతదేహాన్ని అప్పగించారనేది తేలాల్సి ఉంది.