Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ మూడు రాష్ట్రాల్లో కరోనా సబ్ వేరియంట్ : కేంద్రం అలెర్ట్

Covid test
, బుధవారం, 20 డిశెంబరు 2023 (16:08 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. ఈ వైరస్‌లోని కొత్త ఉపరకం జేఎన్ 1 వ్యాప్తిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. కేరళ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ వెలుగు చూసిందని, కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 20 కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌2 జీనోమిక్స్‌ కన్సార్టియం వెల్లడించింది. గోవాలో అత్యధికంగా 18, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కొవిడ్‌-19 ఉపరకం కేసులు నమోదైనట్లు తెలిపింది.
 
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించిన సమాచారం ప్రకారం, ఒక్కరోజే 614 కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. మే 21 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కొవిడ్‌ క్రియాశీల కేసుల సంఖ్య 2311కు చేరింది.
 
ఈ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాప్తిని ఎదుర్కొనే సన్నద్ధతపై అన్ని రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాజా వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సన్నద్ధతపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలన్నారు.
 
కొవిడ్‌ సబ్‌వేరియంట్‌ జేన్‌.1 ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్‌తోపాటు భారత్‌లోనూ ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో.. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్‌.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తాయని తెలిపింది. మరోవైపు గత వారం రోజుల్లోనే సింగపూర్‌లో 56వేల కొవిడ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'యువగళం - నవశకం' వేదిక వద్దకు చేరికను చంద్రబాబు - బాలకృష్టి