మేకలు ఒక యేడాది శిక్షను దిగ్విజయంగా పూర్తి చేశాయి. మేకలు ఏంటి శిక్షను పూర్తి చేయడం ఏంటి ఆలోచిస్తున్నారా? అమ్మతోడు.. ఇది నిజం. మీరు నమ్మితీరాల్సిందే. ఒక యేడాది శిక్షను పూర్తి చేసుకున్న మేకలు బందీఖానా నుంచి ఇటీవలే విడుదలయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో 2022 డిసెంబర్ 6న షహరియార్ సచిబ్ రాజీబ్ అనే వ్యక్తికి చెందిన తొమ్మిది మేకలు స్థానిక శ్మశాన వాటికలోని చెట్ల ఆకులు, గడ్డి తిన్నాయి. దాంతో అధికారులు ఆ 9 మేకలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఏడాదికాలంగా బరిసాల్లోని బార్ల వెనుక ఆ మేకలు బందీలుగా ఉంచారు. తన మేకలను విడిపించుకునేందుకు వాటి యజమాని పలు విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
అయితే ఇటీవల బరిసాల్ సిటీ కార్పొరేషన్‌కు కొత్త మేయర్ ఎన్నికయ్యాడు. దాంతో సచిబ్ రాజీబ్ ఆ మేయర్‌ని సంప్రదించి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. మేయర్ సానుకూలంగా స్పందించడంతో మేకలను విడిచిపెట్టాలని ఆదేశించారు. మేయర్ చొరవతో అధికారులు బంధించి ఉన్న తొమ్మిది మేకలను రాజీజ్‌కు అప్పగించారు.
అయితే, అధికారులు మూగ జీవులకు శిక్ష విధించడం ఇదే తొలిసారి కాదు. రష్యాలోని కోమి ప్రావిన్స్‌లోని సిక్టివ్కర్ నగరంలోని జైలులో ఓ పిల్లి అక్రమంగా ఫోన్లు, గాడ్జెట్లు రవాణ చేస్తుందని అరెస్టు చేసి బంధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎనిమిది గాడిదలు లక్షల విలువ చేసే మొక్కలను తినేశాయని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి.