Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం... బంగ్లా - శ్రీలంక మ్యాచ్ డౌట్?

bangladesh vs sri lanka
, సోమవారం, 6 నవంబరు 2023 (08:25 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో సోమవారం ఐసీసీ వన్డే ప్రపచం కప్ టోర్నీలో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ నిర్వహణ అనుమానాస్పదంగా మారింది. ఇప్పటికే శ్రీలంక జట్టు తన ప్రాక్టీస్ మ్యాచ్‌ను రద్దు చేసుకుంది. బంగ్లా ఆటగాళ్లు మాత్రం మూతికి మాస్కులు వేసుకుని ప్రాక్టీస్ చేశారు. పరిస్థితిలో మార్పు రాకుంటే మాత్రం ఈ మ్యాచ్ రద్దు చేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. 
 
ఢిల్లీలో ఒక్కసారిగా కాలుష్యం పెరిగిపోయింది. ఈ కోరల్లో చిక్కుకుని ఢిల్లీ వాసులు తల్లడిల్లిపోతున్నారు. తమ గృహాలను వీడి బయటకు రాలేకపోతున్నారు. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. దీంతో సోమవారం జరగాల్సిన బంగ్లాదేశ్ - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కాలుష్యం భయంతో ఈ రెండు జట్లూ ఇప్పటికే తమ ప్రాక్టీస్‌ను రద్దు చేసుకున్నాయి. లంకేయులు శనివారం పూర్తిగా ఇండోర్స్‌కే పరిమితమయ్యారు. బంగ్లాదేశ్ కుర్రోళ్లు మాత్రం శనివారం సాయంత్రం ముఖానికి మాస్కులు ధరించి ప్రాక్టీస్ చేశారు.
 
అదేసమయంలో ఢిల్లీలో రోజు రోజుకూ కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ రద్దు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే, మ్యాచ్‌ నిర్వహణపై సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. పరిస్థిని అంచనా వేసేందుకు ప్రఖ్యాత పల్మనాలజిస్ట్ డాక్టర్ రణదీప్ గులేరియీ సేవలను బీసీసీఐ ఉపయోగించుకుంటుంది. 
 
నిజానికి ఐసీసీ నిబంధనల ప్రకారం మైదానం, వాతావరణం లేదంటే మరే ఇతర పరిస్థితులైనా ప్రమాదకరంగా ఉన్నాయని ఫీల్డ్ అంపైర్లు భావిస్తే కనుక ఆటను నిలిపేయొచ్చు. లేదంటే ప్రారంభాన్ని రద్దు చేయొచ్చు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌పై మరికొన్ని గంటల్లో ఐసీసీ, బీసీసీఐ కలిసి ఓ సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా రికార్డులు బద్ధలు కొడతావని ఆశిస్తున్నాను... కోహ్లీ రికార్డుపై సచిన్ స్పందన