ముంబై నుంచి గుజరాత్‌లోని గాంధీ నగర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గేదెను ఢీకొట్టింది. ఈ ప్రమాదం బట్వా- మణినగర్ మధ్య జరిగింది. అయితే ఈ ప్రమాదంలో రైలుకు పెద్దగా నష్టం జరగలేదు కానీ రైలు ఇంజిన్ ముందుభాగం కాస్త విరిగింది. ప్రమాదం తర్వాత ట్రాక్‌ను క్లియర్ చేసిన రైలును మళ్లీ గమ్యస్థానానికి పంపారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
దేశంలోనే తొలి హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం మూడు మార్గాల్లో నడుస్తోంది. వందే ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఢిల్లీ నుండి వారణాసి, ఢిల్లీ నుండి కత్రా, సెప్టెంబర్ 30వ తేదీన గుజరాత్‌లోని గాంధీ నగర్ నుండి ముంబైకి ప్రారంభించబడింది. కాగా గాంధీనగర్ వెళుతున్న వందే ఎక్స్‌ప్రెస్ గేదెను ఢీకొట్టడంతో రైలు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయినప్పటికీ పెద్దగా నష్టం జరగకపోవడంతో రైల్వే యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగ పరిమితి గంటకు 180 కి.మీ. మరికొద్ది నెలల్లో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణీకుల భద్రత, సౌకర్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అందులో వాలుగా ఉండే సీట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఆటోమేటిక్ ఫైర్ సెన్సార్ ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలు, వైఫై సౌకర్యంతో అప్‌గ్రేడ్ చేసిన రైలులో మూడు గంటల బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంది.