Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో 160 విమాన సర్వీసులు రద్దు... ఎందుకో తెలుసా?

flights
, బుధవారం, 6 సెప్టెంబరు 2023 (14:59 IST)
భారత్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే విమాన సర్వీసులను రద్దు చేయనున్నారు. ఇలాంటి సర్వీసుల్లో ఏకంగా 160కి పైగా విమాన సర్వీసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ ప్రతినిధి వెల్లడించారు. ఈ 160 విమానాల్లో ఢిల్లీ నుంచి బయలుదేరే 80 విమానాలు, వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే 80 విమానాలు ఉన్నాయి. ఈ విమానాలన్నీ రానున్న మూడు రోజులు పాటు రద్దయ్యే అవకాశం ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. జీ-20 సదస్సు కారణంగా రానున్న మూడు రోజుల్లో విధించిన ట్రాఫిక్‌ నిబంధనలతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ సదస్సు కోసం ఎయిర్‌ పోర్టులో అన్ని రకాల పరికరాలు, పార్కింగ్‌ సౌకర్యాలను సిద్ధంగా ఉంచామని ఆ ప్రతినిధి వివరించారు.
 
'ఇప్పటివరకు మా అంచనాల మేరకు మూడు రోజుల్లో రాకపోకలు సాగించే 160 దేశీయ విమానాలు రద్దవుతాయని భావిస్తున్నాం. సాధారణంగా ఎయిర్‌ పోర్టు నిర్వహించే దేశీయ సర్వీసుల ఆపరేషన్లలో ఇవి 6 శాతానికి సమానం. ఆంక్షల కారణంగా అంతర్జాతీయ సర్వీసుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము ప్రయాణికుల అసౌకర్యాన్ని వీలైనంత తగ్గించేందుకు విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం' అని ఢిల్లీ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ ప్రతినిధి పేర్కొన్నారు.
 
మరోవైపు విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాయి. విస్తారా, ఎయిర్‌ ఇండియా సంస్థలు తాము ఎంపిక చేసిన, రీషెడ్యూల్‌ అయిన విమాన సర్వీసుల బుకింగ్స్‌ను వినియోగదారులు ఒకసారి మార్చుకొనేందుకు వీలుగా అదనపు ఛార్జీలను తొలగించాయి. ఈ విషయాన్ని ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ప్రకటించాయి. 
 
ఇక సెప్టెంబర్‌ 8-11 మధ్యలో విమాన ప్రయాణాల సమయంలో సర్వీసుల స్టేటస్‌లను జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలని విస్తారా సూచించింది. ఎయిర్‌ ఇండియా కూడా ప్రయాణాలను మార్చుకొన్న వినియోగదారులకు ఒక సారికి అదనపు ఛార్జీలను రద్దు చేసింది. మరోవైపు జీ-20 కారణంగా ఉన్న ట్రాఫిక్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు తొందరగా బయల్దేరి విమానాశ్రయానికి చేరుకోవాలని స్పైస్‌జెట్‌ సూచించింది. చెక్‌-ఇన్‌ కౌంటర్లను ప్రయాణానికి గంట ముందే మూసివేస్తామని వెల్లడించింది.
 
జీ-20 సదస్సుకు హాజరయ్యే ప్రపంచ దేశాల అధినేతల కోసం ఢిల్లీ ఎయిర్‌ పోర్టు ఏర్పాట్లను పూర్తి చేసింది. వాయుసేన వీటిల్లో భాగస్వామి అయింది. అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు, బ్రిటన్‌, కెనడా ప్రధానులు సహా మొత్తం 70 మంది వీవీఐపీ విమానాలు పాలం టెక్నికల్‌ ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ కానున్నాయి. 
 
ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ సహా కొన్ని విమానాలను పాలం ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో పార్క్‌ చేయనున్నారు. దీంతోపాటు అత్యవసర పరిస్థితుల కోసం లక్నో, జైపూర్‌, ఇండోర్‌, అమృత్‌సర్‌లలోని నాలుగు రిజర్వు ఎయిర్‌పోర్టులను కూడా సిద్ధంగా ఉంచారు.
 
ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో 220 పార్కింగ్‌ స్టాండ్‌లు ఉన్నాయి. కానీ, విమానాల రద్దీ పెరగడంతో ఇవిచాలని పరిస్థితి. దీనికితోడు గోఫస్ట్‌ దివాలాతో ఆ సంస్థకు చెందిన 50 విమానాలు ఇప్పటికే పార్కింగ్‌లో ఉండిపోయాయి. దీంతో నిర్ణీత తేదీల్లో ఈ విమానాశ్రయంలో ఛార్టర్డ్‌, బిజినెస్‌ జెట్‌ల ల్యాండింగ్‌, టేకాఫ్‌లను అనుమతించ కూడదని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఎయిర్‌ ఆర్మ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ మార్గదర్శకాలు జారీ చేశాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో బహిర్గతం చేయాలి : సోనియా డిమాండ్