కొందరు రాజకీయ నేతలు అధికార బలంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం లేదా తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా వక్రీకరించిందంటూ చెప్పడం రివాజుగా మారిపోయింది. తాజాగా మహారాష్ట్ర మంత్రి ఒకరు చేసిన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ వంటి నేత్రాలు కావాలంటే చేపలు తినాలని ఉచిత సలహా ఇచ్చారు. చేపలు తింటే కళ్లు ఐశ్వర్యరాయ్ కళ్లలా మిలమిల మెరుస్తాయని బీజేపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర గిరిజన మంత్రి విజయ్ కుమార్ గవిట్ అన్నారు. మహారాష్ట్ర లోని నందూర్బర్ జిల్లాలో మత్స్యకారులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు చేపలు తినడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుందని, కళ్లు మెరుస్తాయని, ఎవరైనా చూస్తే వెంటనే ఆకర్షితులవుతారని అన్నారు.
గతంలో ఐశ్వర్యారాయ్ కూడా మంగుళూరు సముద్ర తీరంలో నివసించేవారని, ఆమె ప్రతి రోజు చేపలు ఆరగించడం వల్లే ఆమె కళ్లు అందంగా మారాయని పేర్కొన్నారు. ప్రతిరోజు చేపలు తిన్న వాళ్ల కళ్లు కూడా ఐశ్వర్య కళ్లలా అందంగా తయారవుతాయని అన్నారు. ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్రంలో పెను దుమారాన్నే రేపాయి.
మంత్రి గవిట్ ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా గిరిజనుల సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మట్కారీ అన్నారు. 'నేను ప్రతిరోజు చేపలు తింటాను. మరి నా కళ్లు కూడా ఐశ్వర్య కళ్లలా మారాలి కదా. బహుశా దీనిపై ఏమైనా పరిశోధన చేయాలేమో.. నేను గవిట్నే అడుగు తాను' అని బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రానే సరదాగా వ్యాఖ్యానించారు.