మహారాష్ట్రం హోంమంత్రి దీపక్ కేసర్‌కేర్ నోరు జారారు. తనకు న్యాయం చేయాలంటూ వెళ్లి అత్యాచార బాధితురాలి అమర్యాదగా మాట్లాడి దుర్భాషలాడారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే, గత యేడాది మే నెలలో థానే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు ఒక మహిళతో పాటు.. ఆమె మైనర్ కుమార్తెను లాక్కెళ్లి బలవంతంగా అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ఆరుగురు నిందితులను వదిలివేసి కేవలం ఒక్కరిపైనే కేసు నమోదు చేశారు.
ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దీపక్ కేసర్‌కర్‌ను కలిశారు. తనకు న్యాయం చేయాలనే కోరేందుకు వెళితే సాక్షాత్తూ మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దీపక్ కేసర్‌కర్ తనను దుర్భాషలాడుతూ అమర్యాదగా మాట్లాడారని బాధితురాలు మెరైన్ డ్రైవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'నీ రేటెంత? నీవు ఎక్కువగా మాట్లాడకు' అని హోంశాఖ మంత్రి దీపక్ కేసర్‌కర్ అన్నారని బాధితురాలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అవమానపర్చిన హోంశాఖ మంత్రి దీపక్ కేసర్‌కర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను బాధిత మహిళ కోరారు.